ఆర్కెమిడీస్ (సిసిలీ)
(క్రీ.పూ. 287-212)
జాతీయపతాకాన్ని ఎగరవేయడం మొదలుకొని వీధులు తుడవడందాకా కావలసిన రకరకాల చిన్నా, పెద్దా పరికరాలెన్నెన్నో రూపొందించి ఉపయోగంలోకి తీసుకువచ్చిన విజ్ఞానవేత్త ఆర్కెమిడీస్. వీటన్నింటికి ఏనాడో, అంటే రెండువేల ఏళ్ళనాడే, రూపకల్పన చేసి కలకాలం జనబాహుళ్యం తనకి రుణపడి ఉండేలా చేసిన అద్వితీయ ప్రతిభాశాతి ఆర్కెమిడీస్.
సిసిలీ దేశంలో సిరాక్యూస్ నగరంలో, క్రీస్తుపూర్వం 287వ సంవత్సరంలో ఫీడియస్ అనే ఖగోళశాస్త్రవేత్తకు జన్మించాడాయన. ప్రాచీన గ్రీకుసంస్కృతికి ఆనాడు ఆటపట్టుగా ఉండే అలెగ్జాండ్రియాలో విద్యాభ్యాసం చేశాడు. '
పైథాగరస్, యూక్లిడ్ వంటి ప్రముఖ గణితశాస్త్రవేత్తల ప్రభావంలోపడి, గణితమంటే,
అందులోనూ రేఖాగణితమంటే, మరీ ఆసక్తి చూపేవాడు. ఆర్కెమిడీస్ చిన్నతనం నుంచీ
కొత్తకొత్త సిద్ధాంతాలు పరిశోధిస్తూ, లెక్కలు చేస్తూ గణితంలో నిమగ్నుడై గణితత్వంలో
మునిగి తేలుతూ ఉండాలనుకునే వాడు. అయితే పరిస్థితులు అందుకు అనుకూలించలేదు.
ఆ దేశం చక్రవర్తి అయిన హీరాన్ అనే ఆయన ఆర్కెమిడీస్ కు దూరపు చుట్టం. చీటికీ మాటికీ, ఏ సాంకేతిక సలహా కావాలన్నా, చనువుగా చక్రవర్తి ఆర్కెమిడీస్ ను సంప్రదించేవాడు. చక్రవర్తి బంగారు కిరీట మొకటి చేయించుకొన్నాడు. కిరీటం అందంగా తయారైంది. మెరిసిపోతోంది మిలమిలా. అయితే రాజుగారికి అనుమానం వచ్చింది. బంగారంలో కల్తీ
ఏమైనా జరిగిందేమోనని.
తన అనుమానం రహస్యంగా ఆర్కెమిడీస్ చెవిలో ఊదాడు రాజుగారు. ఆ బంగారపు కిరీటాన్ని పరీక్షించి, అందులో కల్తీ ఉన్నదీ లేనిదీ
తెలుసుకోవలసిన బాధ్యత ఆర్కెమిడీస్
మీద పడింది. అతడు ఈ సమస్య గురించి
ఆలోచిస్తూ ఉండగా, ఒక రోజున స్నానం
చేయడానికని తాను నీటి తొట్టిలో దిగాడు. నిండుతొట్టిలోకి దిగేటప్పటికి, అందులోంచి
కొంత నీరు సహజంగా పొర్లిపోయింది. అది చూసి ఆర్కెమిడీస్ తటాలున బయటకు వచ్చి
‘యురేకా', 'యురేకా' అని అరుచుకుంటూ, ఒంటి మీద బట్ట ఉన్నదీలేనిదీ కూడా పట్టించుకోకుండా రోడ్డుమీదకి పరుగెత్తాడంట. 'యురేకా' అంటే నేను కనుక్కొన్నానని అర్ధం.తన సమస్యకు సమాధానం దొరికిందన్నమాట.
వెంటనే రెమిడీస్ ప్రయోగం మొదలు పెట్టాడు. ఆ కిరీటంతో సమానమైన బరువు ఉన్న స్వచ్ఛమైన బంగారం తెప్పించాడు. దానిని నిండు నీటిపాత్రలో ముంచాడు. పొర్లిపోయిన నీటిని పట్టి దాని పరిమాణం కొలిచాడు. తర్వాత కిరీటాన్ని కూడా అల్లాగే నీటిలో ముంచి, పొర్లిపోయిన నీటి పరిమాణం మళ్ళీ కొలిచాడు
రెండింటి బరువూ సమానం కనుక, రెండూ ఒకేరకం బంగారంతో చేసినవైతే, వాటిని నీళ్ళపాత్రలో ముంచినప్పుడు పొర్లిపోయే నీరుకూడా సమానంగా ఉండాలి. కాని అట్లాజరగలేదు. పొర్లిపోయిన నీళ్ళ పరిమాణాలు భిన్నంగా ఉండడంతో కిరీటంలో కల్తీ ఉందని తేలిపోయింది.
ఆర్కెమిడీస్ ఆ సందర్భంలోనే తన ప్రసిద్ధ సూత్రాన్ని తెలియజేశాడు. ఒక ద్రవంలో
మునిగి ఉన్న ప్రతి వస్తువూ కొంత బరువు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అయితే అట్లా
తగ్గిపోయినట్లు అనిపించే బరువు ఆ వస్తువుతో సమాన పరిమాణము ఉన్న ఆ ద్రవ భారానికి
సమానంగా ఉంటుంది.
ఈ సూత్రం ప్రతిపాదించడంతో పాటు సాంద్రత అంటే ఏమిటో కూడా వివరించడం జరిగింది. పరిమాణం సమానంగా ఉన్న ఏ రెండు పదార్థాల బరువులైనా పోల్చినప్పుడు. ఫలానా పదార్థం బరువుగా ఉంది కనక, దాని సాంద్రత ఎక్కువ అంటారు.
అయితే నీటిని ప్రమాణంగా తీసుకొని, దానితో పోల్చి ఏ పదార్థమైనా ఎన్ని రెట్ల బరువు ఉందో చెప్తే అది సాపేక్ష సాంద్రత అవుతోంది. ఇంకా ఖచ్చితంగా చెప్తే, ఘనపరిమాణం ఏ ఘన సెం.మీ. గానీ, ఏ ఘ. అ. గాని ఏ ఘ. మీ. గాని ఉన్న పదార్థాన్ని తీసుకొని దాని ద్రవ్యరాశిని చెప్తే అది ఆ పదార్థం సాంద్రత అవుతుంది. ఆర్కెమిడీస్ ఆ విధంగా పదార్థాల్లో
ఉండే సాంద్రత అనే మౌలిక ధర్మాన్ని విశదీకరించి నిర్దిష్టం చేశాడు.
ఆ రోజుల్లో పంపునెవరూ ఎరగరు. నీళ్ళు తోడాలంటే కష్టంగా ఉండేది. నూతిలో నుంచి చేద సాయంతో తోడినట్లే, పంట చేలలోకి నీరుకూడా తోడవలసిందే. ఆర్కెమిడీస్ అది చూసి ఒక సాధనాన్ని తయారుచేశాడు. అదే నేటికీ మన చేలలో వాడకంలో ఉన్న 'గుల్ల'. స్ప్రింగు ఆకారంగా ఉండే ఆ గొట్టాన్ని తిప్పుతూ, పల్లంలోంచి మెరకకి నీటిని
సునాయాసంగా తోడడం సాధ్యమవుతోంది.
హీరాన్ చక్రవర్తికి విజ్ఞానవేత్తల సేవలు, ప్రతిభ ఉపయోగించుకోవడం బాగా తెలుసు.
ఆర్కెమిడీస్ చేత అనేక పనులు చేయించుకుంటూ ఆయనకు కావలసిన అన్ని సదుపాయాలూ
కలిగించాడు. ఆయనకు ఏ లోటు రాకుండా ఆదరించాడు.
జన బాహుళ్యానికి ఉపయోగించేవి అయితేనేం, యుద్ధసమయంలో సైన్యానికి ఉపయోగించేవి అయితేనేం, సుమారు నలభై రకాల సాధనాలు ఆర్కెమిడీస్ తయారుచేశాడు.వాటిలో కొన్నింటిని మనం బాగా ఎరుగుదుం. జెండా ఎగరవేయడానికి ఎత్తుగా జెండాకర్ర మీద బిగించి ఉండే కప్పి ఒకటి, ఒంటి కప్పీని నూతిమీద గిలకగానో, నాటకరంగం మీద తెరలకో వాడడమే కాకుండా కొన్నికొన్ని కప్పీలు కలిపి చట్రాలు (బ్లాక్స్)గా వాడి చూపాడు అతను.
ఆ సందర్భంలో సముద్రం మీద ఉన్న కొన్ని వేల పౌన్ల ఓడను అమాంతంగా చేతితో ఎత్తి వేస్తానని ఆర్కిమిడీస్ సవాలు చేశాడు. ప్రజలు ఆ మాట విని పరిహాసం చేశారు. కానీ కప్పీలు ఏర్పాటు చేసి, ఓడకు పగ్గం బిగించి కట్టి దానిని కప్పీల మీదనుండి పోనిచ్చి, ఆపగ్గంకొన పట్టుకొని చక్రవర్తిని స్వయంగా కిందికి లాగమన్నాడు. చుట్టూ జేరి చోద్యం చూస్తున్న వేలాది ప్రజలు తమ కళ్ళను తామే
నమ్మలేకపోయారు. ఆ పెద్ద ఓడ నీటిమీదనుంచి గాలిలోకి లేచింది నెమ్మదిగా, ఈ వేళ కూడా కప్పీల ఏర్పాటుతోనే క్రేన్లు పెద్ద పెద్ద బరువులు 'సులువుగా ఎత్తడం మనం చూస్తున్నాం.
ఆర్కెమిడీస్ తులాదండాన్ని (లివర్) నిర్వచించి రూపొందించాడు. తిన్నగా, దృఢంగా ఉండే ఏ దండానికైనా ఒక చివర పెద్దభారం ఉంటే రెండో చివర స్వల్పబలం ఉపయోగించి, ఆ భారాన్ని పైకి ఎత్తగలగడం మనమెరుగున్నదే. అయితే, ఆ భారానికి వీలైనంత దగ్గరగా ఏ బిందువు దగ్గరైనా ఆ దండానికి ఆధారం అవసరమవుతుంది..
ఆ బిందువును ఆధారం చేసుకొని దండం కదులుతుంది. త్రాసు, కత్తెర, పట్టుకారు వంటి సాధనాలన్నీ తులాదండాలే. అయితే వక్కల కత్తెర, పడవ తెడ్డు, మరొక రకానికి చెందినవి. నిప్పుబొగ్గులు పట్టుకొనే బొగ్గుకారు. శ్రావణం, వీధి ఊడ్చు చీపురూ మూడోరకానివి. ఆర్కెమిడీస్ తులాదండాన్ని మూడు తరగతులుగా వర్గీకరించి వాటిని వాడడంలో ఉండే యాంత్రిక సౌలభ్యం గురించి వివరించాడు.
తులాదండాల ప్రయోజనాలు వివరిస్తూ, ఆర్కెమిడీస్ “నాకు కాస్త నిలబడడానికి
చోటు దొరికితే చాలు, భూగోళాన్ని పైకి ఎత్తివేస్తా" నన్నాడు. తులాదండానికి ఎంత సామర్థ్యం ఉందో వేరే చెప్పనక్కర్లేదు.
కర్ర, బెండువంటి పదార్థాలు స్వతస్సిద్ధంగానే నీటి మీద తేళ్తాయి. అయితే వీటికంటె ఎక్కువ సాంద్రత ఉండే ఇనుములాంటి లోహాలతో చేసిన వస్తువులు కూడా, నీటిమీద తేలే పరిస్థితులు మొట్టమొదట పరిశీలించినవాడు ఆర్కెమిడీస్. దొన్నెలా చేసినప్పుడు, లోహం కూడా తేలుతుంది. వస్తువులు ద్రవాలమీద తేలడానికి అవసరమైన షరతుల్ని ప్లవన సూత్రాలు (లాస్ ఆఫ్ ఫ్లోటేషన్)గా ఆయన తెలియజేశాడు. తేలే వస్తువుభారం, అది ద్రవం మీదికి ఆనుకున్నప్పుడు పక్కకి తొలగించిన ద్రవ భారానికి సమానమైనప్పుడు అది తేలుతుందన్న
మాట. ఈ బలాలు ఆ వస్తువు నిశ్చలంగా తేలేలా చేస్తున్నాయి.
సిసిలీ దేశానికి రోమన్లతో తరుచూ యుద్ధాలు వస్తూ ఉండేవి. జనరల్ మార్సెలస్ అనే రోమన్, సేనలు తీసుకొని ఒకసారి సిరాక్యూస్ నగరాన్ని ముట్టడించారు. దేశాన్ని రక్షించమని హీరాన్ చక్రవర్తి ఆర్కెమిడీస్ ను కోరారు. అనేక రకాల ఆయుధాలు నిమిషాలమీద తయారుచేయించి శత్రువుల మీద ప్రయోగింపజేశారు.
ఆర్కెమిడీస్ ఒకసారి కోటగోడ మీద పెద్ద పుటాకార దర్పణం (కాన్ కేవ్ మిర్రర్) ఏర్పరిచి, దాని సాయంతో సూర్యరశ్మిని, కోటకింద ఉన్న శతృనౌకల మీదికి కేంద్రీకరింప జేశాడట. దాంతో రోమన్ నౌకలు 'నిప్పు అంటుకొని మండిపోవడం మొదలుపెట్టాయి.
సైన్యమంతా భయపడి చిందరవందరగా పారిపోయింది. కోట గోడమీద నుంచి ఆర్కెమిడీస్
ప్రయోగించిన క్రేన్లు కూడా రోమన్ల పెద్ద పెద్ద సాధన సామగ్రినంతా సులువుగా పైకెత్తి క్రింద పారేసి పొడిపొడి చేసేస్తూ ఉండేవి. అందరూ, ఆర్కెమిడీస్ మంత్రగాడు అనుకొనేటంతవరకు పోయింది అతని ప్రజ్ఞ. ఆ విధంగా మూడేళ్ళపాటు రోమన్లను సముద్రం మీద నిలబెట్టారు.
దురదృష్టవశాత్తు, సిసిలీ సేనలన్నీ ఏదో పండుగ చేసుకొని కాస్త ఏమరపాటులో పడగానే, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోమన్ సైనికులు కోట లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత జరిగిన అఘాయిత్యాలలో ఆర్కెమిడీస్ ను చంపివేయడమొకటి. జనరల్ మార్సెలస్,
ఆర్కెమిడీస్ ను చంపవద్దని ముందుగానే ఆజ్ఞలు ఇచ్చి ఉన్నా, అది పెడచెవిని పెట్టి, ఒక రోమన్ సైనికుడు ఆర్కెమిడీస్ ఉన్న గదిలోకి ప్రవేశించాడు. ఆర్కెమిడీస్ కు అప్పటికి డెబ్భై ఐదేళ్ళ వయస్సు. నేలమీద కూచుని ఏదో ఆలోచిస్తూ ఇసుకలో బొమ్మ ఒకటి గీస్తున్నాడు.శత్రువు తనని చంపడానికి వస్తే, "ఆగాగు! ఒక్కక్షణం. ఈ లెక్క పూర్తి చేయనివ్వు,
చంపుదువుగాని” అన్నాడట, ఇసుక మీద ఉన్న బొమ్మకేసి చూస్తూ. ఆ సైనికుని కరుకు కత్తికి ఆ గణిత శాస్త్రవేత్త మాటలు వినిపించలేదు.
ఆయన భౌతిక విజ్ఞానంలోనే కాకుండా గణితంలోకూడా చాలా కృషి చేశాడు. వృత్తపరిధికీ వ్యాసానికీ ఉండే నిష్పత్తి లెక్కకట్టాడు. పరావలయాకారాల (పారాబొలిక్) విస్తీర్ణాన్ని
ఆయన లెక్కకట్టిన పద్ధతి చూస్తే అదే ఆధునిక కలవగణితం (కాల్ క్యులస్) అనవచ్చు. పెద్దపెద్ద సంఖ్యల్ని 'క్రమాలు' (ఆర్డర్స్)గా మొదటిసారిగా రాసింది ఆర్కెమిడీస్. అంటే ఉదాహరణకి 1200 అనే సంఖ్యను 1.2 x 108 గా రాయడం, ఆ సంఖ్య 10 క్రమంలోదిగా గ్రహించడం ఆ ప్రక్రియలోనిదే. ప్రయోగాలు చేసి, పరిశీలనలు సేకరించి వాటిని బట్టి
తాత్కాలికంగా సిద్ధాంతీకరించడం, తర్వాత దాన్ని ధ్రువపరచడంవంటి శాస్త్రీయ పద్ధతులకు ముఖ్యంగా ఒరవడి పెట్టినవాడు ఆర్కెమిడీస్. స్తూపంలో గోళం ఇమిడి ఉంటే, ఆ రెండింటి మధ్య ఉండే సంబంధమెటువంటిదో పరిశీలించాడాయన. అందులో వ్యాసమూ,ఎత్తూ సమానంగా ఉండే ఒక స్తూపాన్ని నిర్మించాడు. దాన్ని నీటితో నింపాడు, అందులో సరిగా సరిపడే గోళాన్ని ఇమిచ్చాడు. పొర్లిపోయిన నీటి ఘనపరిమాణం కొలిచాడు. ఆ
స్తూపం ఘనపరిమాణంలో 2/3 వంతుకి అందులో ఇమిడిన గోళం ఘనపరిమాణం సమానంగా ఉంటుందని తెలియజేశాడు ఆర్కెమిడీస్. ఈ సంబంధాన్ని కనుక్కోడం తాను చేసిన ప్రధాన పరిశోధనగా ఆయన భావించాడు. అందువల్ల తన కోరిక ప్రకారం, ఆర్కెమిడీస్ సమాధిమీద స్తూపంలో ఇమిడిఉన్న గోళం పటం చెక్కడం జరిగింది. ఆర్కెమిడీస్ చేసిన పరిశోధనలు, నిర్మించిన సాధన సామగ్రి చివరి క్షణం దాకా కొత్త విషయాన్ని తెలుసు
కుందామనే కోరికా, కృషీ చూస్తే విజ్ఞానశాస్త్ర విద్యార్థులందరికీ ఆదర్శ విజ్ఞానవేత్తగా కనిపిస్తాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know